
ములుగు జిల్లా (ది టైమ్స్ అఫ్ తెలంగాణ)
బుధవారం రోజున తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి పదవ తరగతి ఫలితాలలో ములుగు జిల్లా రాష్ట్రంలో 8వ స్థానం సాధించినట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి జి పాణిని గారు తెలిపారు. సందర్భంగా మాట్లాడుతూ 2024-25 విద్యా సంవత్సరం మార్చి వార్షిక పరీక్షలలో ములుగు జిల్లా నుండి 3134 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 3060 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 97.64% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 8వ స్థానంలో నిలవడం అభినందనీయం అని అన్నారు.గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 3.19% అధికం.జిల్లాలో 1608 మంది బాలురు పరీక్షకు హాజరుకాగా 1560 మంది బాలురు ఉత్తీర్ణతతో 97.01% ఉత్తీర్ణత సాధించగా,1526 మంది బాలికలు పరీక్షకు హాజరుకాగా 1500 మంది బాలికల ఉత్తీర్ణతతో 98.30% ఉత్తీర్ణత సాధించారు. గత విద్యా సంవత్సరం 10వ తరగతి ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా 13వ స్థానంలో ఉండగా ఈ విద్యా సంవత్సరం ములుగు జిల్లా ఎనిమిదో స్థానంలో నిలవడం పట్ల జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని హర్షం వ్యక్తం చేస్తూనే, ఉత్తమ ఫలితాల సాధన కోసం కృషి చేసినటువంటి డీసీఈబి కార్యదర్శి, ఏసిజిఈ, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు,మండల విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను అభినందించడం జరిగింది.
ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారి జి పాణిని తో పాటుగా డిసిఇబి కార్యదర్శి ఈ సూర్యనారాయణ, ఏసీజీఈ అప్పని జయదేవ్, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు అభినందనలు తెలియజేయడం జరిగింది. ఏసీజీఈ అప్పని జయదేవ్ మాట్లాడుతూ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు నిరుత్సాహపడకుండా జూన్ మూడవ తేదీ నుండి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబడతాయని దానికి మే 16వ తేదీలోగా ఫీజు చెల్లించాలని విద్యార్థులను మరియు ప్రధానోపాధ్యాయులను కోరారు. ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు రీ వెరిఫికేషన్ మరియు రీ కౌంటింగ్ కోసం అప్లై చేసినప్పటికీ వాటిపై ఆధారపడకుండా విధిగా సప్లమెంటరీ ఫీజు చెల్లించి పరీక్షలకు సిద్ధం అవ్వాలని అన్నారు
